Showing posts with label గ్రాచారం. Show all posts
Showing posts with label గ్రాచారం. Show all posts

Thursday, September 24, 2009

దిల్ బోలే "రక్షించు బాబా.."

నాకు చిన్నప్పటి నుండి ఒక అలవాటు. అలా అప్పుడప్పుడు అంటే యాడాదికి ఒకటో రెండో లా అన్నమాట.. నన్ను నేనే చిత్రవధ కి గురి చేసుకుంటా. (సేడో-మసోచిస్ట్ అనుకునేరు.. అంత బొమ్మ లేదు ) అంటే అదేదో చెట్టుకి కట్టేసుకొని కొట్టుకునే టైప్ కాదు.. మానసికంగా అన్నమాట. దానికి కొన్ని కారణాలు కొన్ని పద్ధతులు అవళంబించుకున్నా. శాస్త్రీ గారనట్టు "రాత్రిలో సొగసు ఏమిటో చూపడనికే చుక్కలు.. బ్రతుకులో తీపి ఏమిటో చెప్పడానికే చిక్కులు .. " అని.. అలా అప్పుడప్పుడు నా బుద్ధిని పదును పెట్టుకునే దానికి నన్ను నేనే బుద్ధిపరంగా కొన్ని చిక్కులకి గురి చేసుకుంటా. దానికోసం కొన్ని సార్లు మంచి సినెమా దోహదపడుతుంది. అంటే రాబోయే సీన్ ఏంటా ఇది ఇలా ఎందుకు తీసాడు అలా ఆలోచిస్తా. దానికి విరుగుడు గా ఇంకో రకం సినెమా ఉంటుంది.. చూస్తున్నంత సేపు చూసినందుకు మనమీద తీసినందుకు దర్శకుని జీవితం మీద విరక్తి కలిగించేవి. ఈ చిత్రం రెండో కోవకి చెందింది.

ఈ ఉపోద్ఘాతం (సొల్లు అని కొంతమంది అనచ్చు) ఎందుకురా అంటే ఎదైన విషయం చెప్పే ముందు కొంచం భూమి పని (groundwork) చేయడం నాకిష్టం గనుక. గత కొద్ది సంవత్సరాళ్ళో ఇంత కంటే చెత్త సినెమా నేను చూడలేదు అంటే అతిశయోక్తి కాదు. ఆ మాట నేనంటున్నాను అంటే ఎంత చండాలంగా ఉందో అర్థం చేసుకోండి. కథ పక్కనబెట్టండి. అసలు .. పోనీ నేను పంజాబ్ కి ఎప్పుడు వెళ్ళలేదు కాని నాకు తెలిసినంత వరకు అక్కడ మనిషి ఎదురైతే రోడ్డు మీద భల్లే భల్లే అని భాంగ్రా వేయరనే అనుకుంటున్నా. అదేంటో యష్ రాజ్ సినిమాల్లో మాత్రమే ఇలా వెరైటీ గా ఉంటారు పంజాబీలు. ఈ సినెమా వాళ్ళకి చూపిస్తే స్తేట్ స్తేట్ మొత్తం పరువునష్టం దావా వేస్తారేమో. రాణీ ముఖర్జీ కష్ట పడి ప్రతి వాక్యం లో పంజాబీ పదాలు కలిపి మాట్లాడ్డం ఏంటో. నేచురల్ గా రావడం వేరు.. పనిగట్టుకొని ఇలా మాట్లాడ్డం వేరు. మొదటిది - అనుకోకుండా ఒక రోజు లో హర్ష వర్ధన్ టైప్ - you dance, i glance లాంటివి. రెండవది .. వద్దులేండి. తలుచుకుంటేనే అదో మాదిరి ఔతుంది పొట్టలో.

కథా పరంగా చెప్పేదానికి ఏమీ లేదు. పాకిస్తాన్ చేతిలో ప్రతి యేట ఓడిపోతూంటంది మగవాళ్ళ జట్టు. వీళ్ళతో ఐతే పని కాదని ఇగ రాణీ లుంగీ కట్టుకొని బరిలో దూకుతుంది. దసర వేషాళ్ళో దొరికే పెట్టుడు మీసాలు గేడ్డం అద్దెకు తెచ్చుకొని ఫెవికాల్ లో అద్దుకొని. అహా తెలీక అడుగుతాను .. ఓ అమ్మాయి అబ్బయిగా వేషం వేసుకోవడం అంటే మీసం గెడ్డం పెట్టుకుంటే సరిపోద్దా ? చేయి చూస్తే చెప్పచు అమ్మాయి అని. ఏంటో. మిగితాది పక్కన పెడితే కూడా. విరక్తి కలుగుతుంది ఇలాంటివి చూస్తే. పోనీ అలా అని పూర్నిమా రావు లా ఆడుతుందా అంటే అబ్బే ... గల్లి క్రికెట్ లో కూడా అంత కంటే అద్భుతమైన షాట్లు చూడచ్చు. గల్లి క్రికెట్ ని దీనితో పోల్చడం తప్పు. అపచారం. రాణీ లాస్ట్ వికెట్ కి వచ్చీ ఓ ఐదోవర్లల్లో ఓ నూట యాభై పరుగులు కొట్టడం అదీ ఆఫ్రీదీ లా ప్రతి బాల్ అడి.. ఆ ఒక్క షాట్ కోసమే దీన్ని కళా-ఖండం గా పరిగణించచ్చు.

ఈ యేడు ఈ సినెమా ని మన అఫీశియల్ ఆస్కర్ గా పంపాలని నా అభ్యర్తన. ఈ సినెమా చూసాక ఇంక జన్మ లో ఎప్పుడు భారతదేశం నుండి సినెమా అంటే చిన్న చూపు చూడరు. జడుసుకుంటారు. భయపడతారు. కాని కాని ఆస్కర్ ఇవ్వకుండ ఉండరు. ఎప్పటికీ. ఓ ఐదు వందల సంవత్సరాల తర్వత ఎప్పుడైన ఆస్కర్ కమిటీ వాళ్ళకి భరత దేశం నుండి సినెమాల మీద చిన్నచూపు వస్తే ఈ సినెమా లో యే ఒక్క సీన్ చూపించిన చాలు. సెట్ అయిపోతారు. అంత పవర్ ఉంది ఈ సినెమా కి. ప్రపంచ చరిత్రలో ఇదో మైలురాయి. స్టీవన్ స్పీల్బర్గ్, గురు దత్, మణి రత్నం, వర్మా, సత్యజిత్ రే, అదూర్ గోపాలకృష్ణన్ - ఎవ్వరు సాధించలేనిది అనురాగ్ సింఘ్ సాధించాడు. జోహార్. ఇది ప్రపంచ అన్ని భాషల్లో అనువదించి రిలీస్ చేసినా ఫ్లాప్ ఔతుంది. అసలు ఈ మహాయుగం లో ఇదే మొట్టమొదటి సినెమా ఐనా ఫ్లాప్ అయ్యేది. అంత గొప్ప చిత్రం ఇది. దీన్ని మీకోసం మిస్స్ అవ్వకండి. ప్లీజ్ నా కోసం వెళ్ళి చూడండి. చూసారా "చూడండి" అని అన్నాను "చూసి రండి" అని అనడం లేదు.. అంత potential ఉన్న మూవీ ఇది. గ్రేట్ సినెమాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇలాంటివి అరుదు. అందుకే చూసి తరించండి.

Read more...

Wednesday, August 12, 2009

మేరా నంబర్ కబ్ ఆయేగా ??

ఎనిమిదేళ్ళు. eight long years ఆఠ్ సాల్.. భాష మారినా భావం ఒక్కటే. సంవత్సరాలు గడచినా బాధ ఒక్కటే. ఈ రోజుకి నేను నా స్వర్గం వదిలి ఎనిమిదేళ్ళయ్యింది. నా స్వగ్రామం నా స్వనగరం నా ఊరు.. నా హైదరాబాదు. దాన్ని విడిచి ఇన్నేళ్ళైనా హైదరాబాదు ఎంతగా మారినా సొంతం అనేపాటికి అదో ఆత్మబంధం. నా ప్రపంచం ని రెండుగా విభజించచ్చు. ఒకటి హైదరాబాదు ఇంకోటి నాన్-హైదరాబాద్ (non-hyderabad).

ఎనిమిదేళ్ళా క్రితం రింగులు రింగులు తిప్పితే.. హిల్టన్ లో కూర్చొని దం చాయి తాగుతూ అప్పుడప్పుడు వర్షం పడితే వేడి వేడి పకోడి తింటూ.. రోజూకి ఎక్కువకాదు మామూల్గా ఓ పదో పాతికో వందో పానీ పూరీలు తింటూ ఉండినాను. నలుగురితో నారాయణా అని అందరు రాస్తున్నారు కద అని నేను రాసా జి.ఆర్.యీ నా అద్రుష్టం పండి మధ్యలో విసొగొచ్చి త్వర త్వరగా అవ్వగొట్టేసా .. న్యాచురల్ గానే ఎదో మామూల్ స్కోర్ వచ్చింది. యాహూ అనుకొని గెంతుకుంటూ బయటకి వచ్చా.. ఈ స్కోర్ కి ఎవడిస్తాడు లే అని.. నేను అల తలిస్తే, నన్నే కాపీ కొడతావా అని పైనున్న విధాత మరోలా నిర్ణయించాడు. సీన్ కట్ చేస్తే యడ్మిషన్ వచ్చింది. సరేలే.. వీసా వస్తదా పెడ్తదా అనుకునొని దగ్గర్లో ఉన్న డ్రాప్ బాక్స్ (ఇది ఆ కాలం మాటాలు. గుర్తుందో లేదో చాలా మందికి, ఆ యేడే కొత్తగా drop box పెట్టారు స్టూడెంట్ వీసా కి. అదే యేడు తీసేసారు 9/11 తర్వాత. అది వేరే విషయం) లో పడేసా.. మందు కొట్టాడో ఏమో నాకు ఇచ్చేసారు వీసా. ఆ రోజే అనుకున్న.. శశి అయిపోయింది రా నీ హ్యాప్పీ డేస్ అని..

ఎనిమిదేళ్ళు గడిచాయి ఇక్కడికి వచ్చి. నా జీవితం ఏంట్రా అని వెనక్కి తిరిగి చూస్తే పాని పూరి కోసం వేవిళ్ళూ తప్ప ఏమీ కనిపించడం లేదు. కొంచం కళ్ళాజొడు సరి చేసుకొని చూస్తే .. చకోర పక్షి లా .. హిటొస్తుంది అని వేచి చూస్తున్న సాయి కిరణ్ లా.. కామెడి పండిస్తా అని అనుకుంటున్న బాలయ్య లా దేశానికి తిరిగివెళ్ళిపోవాల్లన్నా ఆశ తప్ప ఏమీ లేదు. నా స్నేహితులు కొంత మంది ఇప్పటికే తిరుగు టపా కట్టేసారు. ఇంకొంతమంది అదే పని లో ఉన్నారు. నేను ఇంకా "మేరా నంబర్ కబ్ ఆయేగా " అని వేచి చూస్తున్నా. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది.. అంత కంటే ఏం చేయలేము. ఎనిమిదేళ్ళల్లో ఈ దేశం లోని 30 రాష్ట్రాలు చూసాను. దిక్కు మొక్కు లేని డకోటా ప్రాంతం తప్ప బానే కవర్ చేసా.

ఎంచక్క ఇంటి దగ్గర సాయంత్రం 5 కి ఓ రెండు రూపాయలు ఇస్తే అరకిలో వేడి వేడి జిలేబిలు - తోచినప్పుడు పానీ పూరీలు , ఓస్మానియా బిస్కెట్ తో బాటు దం చాయిలు, బావర్చి బిర్యానీ, 113M, 156H, 3 నంబర్ బస్సు, ఆదివారం ఆబిడ్స్ లో పాత పుస్తకాలు, గల్లీ ఓ పది వినాయకులు.. అక్కడ దొరికే ప్రసాదాలు, నిమ్మజ్జనం గలాటాలు, హోళీ రంగులు, సంక్రాంతి పతంగుల ఢీల్ - లడీ - పేంచులు, దీపావళి పటాసులు, బోణాల జాతరలు, హలీములు, అలెక్స్ కిచన్ లో 'american chopsueyలు, గురువారం బాబా గుడిలో భజనలు, నీల్గిరి లో ... లు, RTC X Roads లో లెక్కకుమించిన సినిమాలు, పారడైస్ సాఫ్టీ డెన్ లో ఐస్ క్రీంలు.. లాంటివి ఎంజాయి చేయడం మానేసి ఇక్కడెక్కాడో.. ఇలా.. ప్చ్..

నా ప్రశ్నకి వరుణ్ విశ్వరూపం:

శశి:
ఇక చాలు అమెరికా. ఇక చాలు. ఇంత దాకా నేను కోల్పోయింది చాలు.

వరుణ్:
ఏం కోల్పోయావ్ శశీ?

శశి:
ఇంకా అర్థం కాలేదా నీకు...? యెనిమిదేళ్ళ క్రితం నా దగ్గర యేముండేదో, ఇప్పుడేం లేదో ..అదే కోల్పోయాను.. ఆనందం.. చిన్న చిన్న విషయలకు ఉండే ఆనందం..ఈ అమెరికా ఎప్పుడూ నాకు గొప్ప జీవితాన్ని ఇస్తున్నట్టే ఫీల్ ఔతుంది. కానీ నాకేం కావాలో అర్థం చేసుకోదు.

వరుణ్:
శశీ, నీకు ఎప్పుడు అమెరికా లో ఏం చాన్స్ వచ్చినా అది నీ జీవితాన్ని వేయి రకాలు గా బాగు పరిచేది గా ఉంటుంది కదా.

శశి:
ఔను.. వేయి రకాలుగా బాగు పడే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క సారి నాకు ఏం కావాలి అని ఆలోచించదు. అడిగిందాని కన్నా ఎక్కువ ఇవ్వడం లో ఉన్న సాటిస్ఫాక్షన్ అమెరికా కు తెలుసు.. కానీ కోరుకొన్నది దొరక్క పోవడం లో ఉండే బాధ అమెరికా కు తెలీదు.. నాకు తెల్సు..అస్సలు ఎవరైనా నన్ను అడిగితే కదా తెలిసేది నాకు ఏది కావాలో ఏది ఒద్దో..! ఎదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తారు.. నన్ను అడగండి వరుణ్.. నా కళ్ళళ్ళో చూసి అడగండి వరుణ్.

వరుణ్:
ఎంటి శశీ, అప్పుడే అమెరికా వెళ్ళే ముందే అడిగాం కదా శశీ నీకు ఇష్టమా లేదా అని..

శశి:
అడిగారు, కానీ నేను చెప్పేది వినరు.. ఆశలు చూపిస్తారు..జీ ఆర్ యీ వ్రాయమంటారు..

నాకు జీ ఆర్ యీ స్కోరు రాకూడదు అని నేను అనుకొన్నా. తీరా చూస్తే వచ్చింది.. నాకెలా ఉండిందంటే, ఆ స్కోరు కార్డ్ చించేసి నేను అమెరికా కు వెళ్ళనూ అని అరవాలనిపించేది.. వీసా వచ్చినప్పుడు కదా అని అప్ప్లై చెయ్యమన్నావ్. నేను చేసాను. కానీ ఇలా అప్ప్లై చెయ్యగానే అలా పోస్ట్ లో వీసా పంపిచేసారు.. ఏడుపొచ్చింది వరుణ్ అప్పుడు నాకు.. ఏడుపొచ్చింది... ! ఒరే శశీ వెళ్ళరా చదివేసుకొని మళ్ళీ వచ్చేయచ్చు అని చెప్పారు. నేనేదో... చదివేసి వెళదాం అనుకొన్నా.. కానీ ఈ అమెరికా ఏమో, నాకు ఉద్యోగమొచ్చేంత చదువు చెప్పింది... నా ఉద్యోగం కూడా అమెరికాయే ఇప్పిస్తే.. నేనెందుకు వరుణ్, ఇండియా వెళతాను..? చివరికి వెనక్కు వెళ్ళాలన్నా, కుదరని పరిస్థితి కల్పిస్తే.. వెళ్ళ బుద్ది కావడం లేదు వరుణ్..

మీకెవరికీ తెలీదు.. ఇలా అమెరికా లో ఉండలేకా, ఇండియా వెళ్ళలేక నేను నరకం చూసాను వరుణ్, నరకం చూసాను. కోపం, ఫ్రస్ట్రేషన్.. ఎవరి మీద చూపించాలో కూడా తెలీక ఒక రోజు బుడుగు మీద కూడా అరిచేసాను. దాంతో తను వేరే బ్లాగ్ పెట్టుకొన్నాడు. నేను ఎందుకు అలా అరిచానో బుడుగుకే అర్థం కాక పోతే..ఇక మిగిలిన వాళ్ళకు ఎం తెలుస్తుంది వరుణ్..? ఇక్కడకొచ్చేప్పుడు.. నేను ఇండియా లో చెప్పాను. రెండేళ్ళలో మళ్ళి వచ్చేస్తాను అని.. కానీ ఇప్పుడు చెపుతున్నా.. రెండేళ్ళూ కాదు కదా, మరో పదేళ్ళయినా వెళ్ళలేనని.. ఇప్పటి దాకా మీరంతా గెలిచారని సంబరపడుతున్నారు కదా.. కానీ మిమ్మల్ని గెలిపించడానికి యెనిమిదేళ్ళుగా నేను ఓడి పోతూనే ఉన్నాను వరుణ్...ఇలాగే ఓడిపోతుంటే.. ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి చూసుకొంటే.. నా జీవితమంతా అమెరికా యే ఉంటుంది.. అందులో ఇండియా ఉండదు. దయచేసి నాకు నచ్చని దేశాన్ని ఇచ్చి నన్ను ఆనందంగా ఉండమనొద్దు వరుణ్..!

వరుణ్: ఇంత కాలం నువ్వు అమెరికా లో ఆనందంగా ఉన్నావ్ అనుకొన్నా గానీ శశీ, నీ ఆనందాన్ని తీసుకొని మేము సంబర పడ్డమని తెలీదు. తెలీదు శశీ.. ! నాకు అమెరికా లో కంపెనీ కి సి.యి.ఓ గా వచ్చినా ఆనంద పడలేదు కానీ, నీకు అమెరికా లో సీట్ వస్తె రోజంతా పది మందికి చెప్పి ఆనందపడ్డాం.. కానీ మా ఆ ఆనండం కోసం నిన్ను బాధ పెడుతున్నా అని ఎప్పుడూ అనుకోలేదు శశీ.. సారీ రా నాన్నా..! వెంటనే ఇండియా కు వచ్చేసెయ్..

శశి:
థాంక్స్ వరుణ్. మరో రెండేళ్ళాగి వస్తా...!

Read more...

Tuesday, June 16, 2009

i want to break free..

జీవితం లొ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏం చేస్తున్నానా అని. బహుశా ఇది చాలా మందిని కాలం తన్ని మరీ అడిగే ప్రశ్నే. ఏం చేస్తున్నానా అంటే ఈ రోజు ఈ పూటా ఈ క్షణం అని కాదు జీవితం తో జీవితం లో ఏం చేస్తున్నానా అని. అలా రోజులు గడిచిపోతోంది నెలలు సంవత్సరాలు కాని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందనట్టు అక్కడే అదే ఫార్ చక్రాలు (టెన్షన్ పడకండి నేనన్నది for loops అని) కాలా చక్రాం లో రాసుకుపోతున్నా.

ఎనిమిది తొమ్మిది యేళ్ళగా రాసిన ఫార్ చక్రాలే రాసీ రాసీ అలసిపోయా. 8085 మొదలుకొని వివిధ భాషల్లో రాసి ఇదిగో ఇప్పుడు లేటెస్ట్ గా .NET లో వెలగబెడుతున్నా. కాని ఏమి మార్పు లేదు .. ప్రతి రెండు మూడేళ్ళకి మారిన బిరుదు, జన్మానికో శివరాత్రి లా మారే జీతం తప్ప. అన్నమయ్య కూడా వివిధ రసాల్లో సంకీర్తనలు వ్రాసారు. ఒక సారి "భావాయామి గోపాలాబాలం మనఃసేవితం చింత్యే అహం సదా" అని మరో సారి "ఫలనేత్రానల ప్రబల విధుల్లతకేలి" అన్నారు. నేను మాత్రం for(int i =0; i < నా జీవితం; i++) అని రాస్తునే ఉన్నాను.

పరిస్థితులు బాలేనప్పుడు ఏంటీ గోల అంటే మరి మరి పరిస్థితులు బాగున్నప్పుడు కూడా ఇలా అప్పుడప్పుడు అనిపించేది నాకు. తప్పుపట్టకండి.. నేను చేస్తున్న పని నాకు నచ్చే నాకిష్టం వచ్చే చేస్తున్నా. కాని నా ఆవేదన పని మీద కాదు నా మీద. రెంటికి D. రంగా రావ్ సినిమాకి కే. విశ్వనాథుని సినిమాకి ఉన్నంత వ్యత్యాసం ఉంది. (డి. రంగా రావ్ ఎవరు అంటే అతనో మహానుభావుడు. "నవ్వు నవ్వించు", "మర్డర్" లాంటీ కళని, చూసిన వాల కలల్ని, ఖండించే చిత్రాలు తీసిన గొప్ప వ్యాక్తి. గుర్తొచ్చింది నవ్వు నవ్వించు చిత్రం రివ్యు కోసం వేచు చూస్తూండండి. శంకర్ రేంజి మూవి. చూడకపోతే వెంట్టనే వెళ్ళి చూడండి. థియేటర్ లో కాదు DVD లో. ఆ చిత్రాన్ని థియేటర్ లో ఎవ్వరు చూడలేరు.)

ఈ ఫార్ చక్రాలు వైల్ (while) చక్రాలనుండి i want to break free. కాని ఎలా అన్నదే నా బుర్రకి తోచడం లేదు. ఎంత సేపు "దత్తం పెట్టి" (అదే database) కి అనుసంధానం సరిగ్గా ఉందా ఉంటే కూడా రాసిన కోడు ఎందుకు పనిచేయడం లేదు చెప్మా ఉప్మా అని అనుకోవడం తోనే సరిపోతోంది. చస్స్.. ఏదో రాద్దాం అనుకొని ఏదో రాయబోయి ఏదో రాస్తున్నా. నా బుర్రని ఇప్పుడు లక్ష దిక్కుల్లో శతకోటి ఆలోచనలు పీకుతున్నాయి. అందుకే ఇలా సటిలాయిట్ సిగ్నల్ అందని జి.పి.యస్ లా ఉన్నా. ఇరవై నాలుగు గంట్టల్లో కనిష్టం ఒక 10 గంటలి ఇలా కోడు రాసి డీబగ్ చేస్తుంటే పిచ్చి పిచ్చి ఆలోచనల్తో ఇదేనా జీవితం అంటే? నాకు విముక్తి లేదా ? అని అనుకుంటున్నప్పుడు మహాకవి శ్రీ శ్రీ గారన్నది గుర్తొచింది:

నేను సైతం కోడూ ప్రపంచానికి లూపు ఒక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం కోడూ వ్రుష్టికి if ఒక్కటి రాసిపెట్టాను
నేను సైతం వెబ్బు ఘోషకు bug ఒక్కటి పట్టి చంపాను

ఆ మాహాకవే అలా అన్నాక ఇంక చేసేది ఏమీ లేదని ఈ ఫార్ వ్యూహం లో - దర్శకేంద్రుని చేత్లో చిక్కిన ద్రాక్ష లా, వరం సినిమా నిర్మాత లా - చేసేది ఏమీ లేక .. ఏమీ చేయలేక నా బ్రేక్ పాయింట్ చేరే వరకు అలా తిరుగుతునే ఉందాం అని డిసైడ్ అయ్యాను. చూద్దాం.. బాలయ్యే కామెడి ట్రై చేయగాలేంది నేను ఈ లూపు నుండి బ్రేక్ అవ్వలేనా?

Read more...

Monday, June 1, 2009

నేను నా లాప్ టాప్...

మొన్న శుక్రవారం మా ఇంట్లో ఓ భయమకరమైన బాంబ్ పేలింది. ఈ మధ్యలో మన నగరాల్లో పేలుతున్న రకం కాదు. ఇది నా జీవితానికి సంబంధించినది. నేను ముద్దులార చూసుకుంటున్న నా లాప్ టాప్ చచ్చింది. గత నెల రోజుల నుండి నేను అహర్నిశలు చేసిన పని మొత్తం ఢమాల్ అయ్యింది. నాకేమో ఏం చేయాలో తెలీలేదు. ఈ వారాంతం మాకో డెలివరీ ఉంది. ఇప్పుడు ఇల అయితే కనిష్టం ఒక వారం ఎక్కువ ఔతుంది.. మాకు అంత సమయం లేదు. ఇంక చూడాలి నా పరిస్థితి.

అప్పుడు సమయం ఏమో రాత్రి 9 అవ్వబోతోంది. ఇంక షాపులు కూడా ఉండదు. వెంట్టనే వెళ్ళాం ఓ రెండు షాపులకి. కాని ఎక్కడా నాకు డాకింగ్ స్టేషన్ దొరకలేదు. నా లాప్ టాప్ మొదలు పెడితే బూటింగ్ శబ్ధం వస్తోంది కాని ఏమి కనిపించడం లేదు. అందుకే ఇది మానిటర్ గొడవేమో అనుకున్నా. మా బాస్ కి ఒక ఫోన్ కొట్టా బాబు కలెక్షన్ నిల్లు బాలు నా బ్రతుకు బస్టాండు పాలు అని. ఆ పిడుగు లాంటి వార్త విన్న వెంట్టానే రాయిలా గట్టిగా ఉండే మనిషి ఏక ధాటిగా "పరదేశీ", "వివాహ్", "హం సాత్ సాత్ హైన్" వరుసగా చూసిన వాడిలా ఢీలా పడిపోయాడు. ఇంక ఇల అయితే చేసిన పనే మళ్ళా చేయాల్సొస్తదా అని మా పాత కంపనీ లో పని చేసే స్నేహితుడి వెంటబడి పాపాం వాడు నిద్ర పోతున్నా లేపి ఆపీసు కి తీస్కెళ్ళి డేటా మొత్తం కాపీ చేయించా. దాని వళ్ళ కొంచం ఊరట కలిగింది. తీరా ఇంటికి వచ్చి మరోమారు మొదలెట్టేప్రయత్నం చేస్తే నా లాప్ టాప్ ఆన్ అయ్యింది. యాహూ అనుకొని అటు ఇటు కొంత సేపు గెంతా. మిగిలిన డేటా అంతా కాపీ చేసుకున్నా. ఇది శుక్రవారాం.

నా లాప్ టాప్ కి నా గురించి ఎంత క్షుణ్ణాం గా తెలుసంటే టంచన్ గా అది సోమవారం ప్రొదున్న మళ్ళా పని చేయడం ఆపేసింది. రెండు రోజులు పని చేసింది కద అన్న ఆనందం కాస్త ఈ రోజు ప్రొదున్నకి తీరిపోయింది. దాంతో మధ్యానం వరకు ఒక డాకింగ్ స్టేషన్ కోసం తిరగని చోటు లేదు ట్రై చేయని పోర్టు లేదు. విధి ఆడిన వింత నాటకం లో నా లాప్ టాప్ ఇంక పని చేయడం పూర్తిగా మానేసింది. డెల్ల్ వాడికి కాల్ చేస్తే వాడేమో ఇంకే ఎత్తి చెత్త కుప్ప లో పడేయి అన్నాడు. అంటే ఇంచు మించు గా ఇదే రకం గా అన్నాడు. మళ్ళా కాంగ్రెస్స్ గెలిచినంత బాధేసింది. అదే చెప్పా వాడికి.. పాపాం మేగాస్టార్ ఫ్యాన్ అనుకుంటా ఇంకో ఉపాయం చెప్పాడు. తల్లిరేకు - అంటే మదర్ బోర్డ్ మారిస్తే బాగుపడచ్చు అని. ఇంక చేసేది ఏమీ లేక ప్రస్తుతానికి ఒక మదర్ బోర్డ్ కొరకు దరఖాస్తు పెట్టా. అది రేపు వస్తుంది. తర్వత మళ్ళా ఎక్స్.పి మొదలు అన్ని పెట్టుకోవాలి. ప్చ్.. అది ఈ రోజు నా దుస్థితి. ఇంక రేపు లాప్ టాప్ తెరిచి కొత్త మదర్ బోర్డ్ పెట్టి అన్ని సక్రమంగా సాగితే దాని నుండి ఇంకో టపా వేస్తా. లేకుంటే అనుకునదొక్కటి అయినది ఒక్కటి అని పాట పాడుకుంటూ కనిపిస్తా...

నేను లేను కద అని వందలకొద్ది టపాలు వేయకండి. ఓ పది అంటే తట్టుకోగలను.

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP